బాంబు పేలుళ్ల కుట్ర కేసును మరో కోణంలో పరిశీలిస్తున్న ఎన్ఐఏ
విజయనగరంలో బయటపడిన ఉగ్ర కుట్ర కేసును ఇక ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు
విజయనగరంలో బయటపడిన ఉగ్ర కుట్ర కేసును ఇక ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏకు విజయనగరం పోలీసులు అప్పగించనున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసును విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు కలసి సంయుక్తంగా విచారించారు. అయితే ఈ కేసులో సిరాజ్, సమీర్ చెప్పిన విషయాలతో దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ విస్తరించి ఉందని భావించిన ఎన్ఐఏ అధికారులు అన్ని చోట్ల తనిఖీలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో ఎటువంటి దుర్ఘటన జరగకముందే పసిగట్టి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ముప్ప తప్పింది.
అన్ని చోట్ల తనిఖీలు...
విజయనగరం అయితే ఎవరికీ అనుమానం రాదని భావించి అక్కడి నుంచే కుట్రకు ప్లాన్ చేశారు. అయితే ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని విచారణలో తేలడంతో ఇక మిగిలిన నగరాల్లో ఉంటున్న వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిరాజ్, సమీర్ లతో కాంటాక్టులో ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సమీర్, సిరాజ్ లతో పరిచయం దగ్గర నుంచి వారి నుంచి వచ్చిన మెసేజ్ లు, మాట్లాడిన విషయాలను తెలుసుకుని ఆ దిశగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగించేదుకు సిద్ధమయినట్లు తెలిసింది.
ఆరు నెలల నుంచి...
ఆరు నెలల నుంచి వీరి సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు కన్నేసి ఉంచారు. ఇప్పుడు విచారణలో తెలిసిన విషయాలు ఆధారంగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహంచి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నది ఎన్ఐఏ అధికారుల ఆలోచనగా ఉంది. సమీర్, సిరాజ్ లను వారం రోజుల పాటు విచారించడంతో కొన్ని కీలక విషయాలను రాబట్టిన ఎన్ఐఏ ప్రధానంగా హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు బృందాలు తరలి వెళ్లినట్లు తెలిసింది. ఈ గ్యాంగ్ లో మొత్తం పదిహేను మంది వరకూ ఉన్నట్లు అంచనాలు వినపడుతున్నాయి. అలాగే వీరికి ఆర్థిక సహకారం అందించిన వారిని కూడా సౌదీ, ఒమన్ ల నుంచి కూడా రప్పించాలని యోచిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు విజయనగరం పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారులు చేపడితే మరింత మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.