హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూంలో గీజర్ పేలి నవదంపతులు మృతిచెందారు. లంగర్‌హౌస్‌లోని ఖాదర్‌భాగ్‌కు చెందిన డాక్టర్ ఉమ్మాయ్ మెహిమాన్ సాహిమ, డాక్టర్ నిసారుద్దీన్ భార్యాభర్తలు.. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది. నిసారుద్దీన్ సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బాత్‌రూమ్‌లో ఉన్న గీజర్ పేలడంతో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దంపతులు ఖాదర్‌బాగ్‌లోను, సాహిమ తల్లిదండ్రులు టోలిచౌకిలోని మెరాజ్ కాలనీలో నివాసముంటున్నారు. ఉదయం నుంచి సాహిమ నుంచి ఫోన్ రాకపోవడం, కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఖాదర్‌బాగ్‌లో కూతురు, అల్లుడు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకూ తలుపులు తెరవలేదు. దాంతో డోర్లు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నిసారుద్దీన్, సాహిమా బాత్రూంలో పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారమివ్వగా ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టంకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.