సుబ్రమణ్యం హత్యకేసులో కొత్త ట్విస్ట్.. అనంతబాబు చెప్పిందంతా అబద్ధమా ?

శంకర్ టవర్స్ వద్ద వాచ్ మెన్ గా పనిచేసేది సుబ్రమణ్యం చిన్నాన్నే. సుబ్రమణ్యం చనిపోయిన రోజు రాత్రి అసలు ..

Update: 2022-05-24 09:52 GMT

అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. పోలీసుల కస్టడీలో ఉన్న అనంతబాబు చెప్పిందంతా అబద్ధంలా కనిపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే సుబ్రమణ్యాన్ని హత్య చేశారా ? పోలీసులకు కట్టుకథ చెప్పారా ? శంకర్ టవర్స్ వద్ద అనంతబాబు - సుబ్రమణ్యానికి మధ్య అసలు ఘర్షణే జరగలేదా ? అన్నవి చిక్కుముడుల్లా మిగిలిపోయాయి. ఇప్పుడు శంకర్ టవర్స్ వద్ద ఉన్న వాచ్ మెన్ చెప్తున్న విషయాలు ఈ చిక్కుముడులు విప్పేందుకు దోహదపడేలా ఉన్నాయి.

శంకర్ టవర్స్ వద్ద వాచ్ మెన్ గా పనిచేసేది సుబ్రమణ్యం చిన్నాన్నే. సుబ్రమణ్యం చనిపోయిన రోజు రాత్రి అసలు అక్కడ గొడవే జరగలేదని చెప్తున్నారు. వాచ్ మెన్ ని అయిన తాను.. గేట్ పక్కనే ఉంటానని నిజంగా అక్కడేదైనా జరిగి ఉంటే.. తమకు తెలియకుండా ఉండదంటున్నారు. అనంతబాబు సాయంత్రం 4 గంటలకు వెళ్లారని.. మళ్లీ రాత్రి ఒంటిగంటకే తిరిగి వచ్చారని వాచ్ మెన్ చెబుతున్నాడు. ఆ సమయంలో అనంతబాబుతో మేడమ్ కూడా ఉన్నారని, రాత్రి 1 గంటకు వారిద్దరూ కలిసి పైకి వెళ్లగా.. తిరిగి అనంతబాబు ఒక్కరే కిందికి వచ్చారని చెప్పాడు.
ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజీని తీసుకెళ్లారన్నారు. ఆ ఫుటేజీలో ఎలాంటి గొడవ రికార్డవ్వలేదని సుబ్రమణ్యం చిన్నాన్న చెప్పారు. ఇదే నిజమైతే అనంతబాబు పోలీసులకు కట్టుకథ చెప్పాడన్నది వాస్తవం. రాత్రి ఒంటిగంట సమయంలో అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సుబ్రమణ్యం హత్య జరిగినప్పుడు ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మే 20వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో సుబ్రమణ్యం అనంతబాబు అనుచరుడైన మణికంఠతో కలిసి బయటికి వెళ్లాడు. అర్థరాత్రి 12.30 గంటల సమయంలో సుబ్రమణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని అనంతబాబు సుబ్రమణ్యానికి ఫోన్ కాల్ చేశాడు. ఆ తర్వాత 1.30 గంటలకు అనంతబాబు సుబ్రమణ్యం తమ్ముడు నవీన్ కి ఫోన్ చేసి ఆస్పత్రికి రావాలని చెప్పగా.. అప్పటికే సుబ్రమణ్యం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తొలుత సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా, ఆ తర్వాత 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.





Tags:    

Similar News