సిద్ధలేశ్వర కోన జలపాతం వద్ద యువకుడు మృతి

నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లో ఉన్న సిద్ధలేశ్వరకోనలో కిషోర్ అనే యువకుడు నీట మునిగి చనిపోయాడు

Update: 2021-12-13 12:43 GMT

నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లో ఉన్న సిద్ధలేశ్వరకోనలో నిన్న కిషోర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నీటిగుంతలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. గూడురు మండలం చౌటపాలెంకు చెందిన ఐదుగురు యువకులు నిన్న ఆదివారం కావటంతో రాపూరు మండలంలోని రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న సిద్దలేశ్వర కోన జలపాతం తిలకించేందుకు వెళ్లారు. కొద్దిసేపు వారంతా అక్కడ జలకాలాడి ఊరికి తిరుగుపయనమయ్యారు. సిద్ధలేశ్వరకోన జలపాతం నుంచి కొంతదూరం వచ్చాక ఆ ఐదుగురిలో కిషోర్ అనే యువకుడు కనిపించలేదు.

గాలింపు చర్యల్లో....
కంగారుపడిన అతని స్నేహితులు కిషోర్ కోసం చుట్టుపక్కల ప్రాంతంలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. పైగా అటవీప్రాంతం.. చీకటిపడుతుండటంతో ఆ నలుగురు ఊర్లోకి వచ్చేశారు. గ్రామంలోని పోలీసులకు తమ స్నేహితుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో.. సోమవారం పోలీసులు జలపాతం వద్ద గజ ఈతగాళ్లతో, ఫారెస్ట్ అధికారులతో కిషోర్ కోసం గాలించగా.. విగతజీవుడిగా కనిపించాడు. వెంటనే జలపాతం నుంచి కిషోర్ మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చి, పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిషోర్ తో పాటు వెళ్లిన స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు కిషోర్ నీటిగుంతలో పడి చనిపోయాడా ? లేక అతని స్నేహితులే కిషోర్ ను చంపేందుకు ఇలా చేసి ఉంటారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News