ఉల్లిపాయల బస్తాల కింద 405 కిలోల గంజాయి

విజయవాడ కస్టమ్స్‌ అధికారులు కారు డిక్కీలో, ఉల్లిపాయల బస్తాల కింద పెట్టి తరలిస్తున్న 405 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Update: 2023-06-27 04:10 GMT

తెలుగు రాష్ట్రాలలో గంజాయి స్మగ్లింగ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని మేడ్చల్ లో 210 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్న విషయాన్ని మరచిపోక ముందే విజయవాడలో ఏకంగా 405 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు.

విజయవాడ కస్టమ్స్‌ అధికారులు కారు డిక్కీలో, ఉల్లిపాయల బస్తాల కింద పెట్టి తరలిస్తున్న 405 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను గుర్తించారు. 150 కిలోలు డిక్కీలో పెట్టి తరలిస్తున్న కారును, ఉల్లిపాయల బస్తాల అడుగు భాగాన గోనెసంచుల్లో ఉన్న 255 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సరకు విలువ రూ.81 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు.
మేడ్చల్‌లో సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్‌వోటి శంషాబాద్, మేడ్చల్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఆ సమయంలో కారులో తరలిస్తున్న 210 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. గంజాయి విలువ మార్కెట్‌లో దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు దీన్ని తరలిస్తున్నారని విచారణలో కనుగొన్నారు.


Tags:    

Similar News