చిత్తూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), స్నేహితుడు బాలాజీ (25) చనిపోయారు.

Update: 2022-09-21 03:25 GMT

చిత్తూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు సహా ముగ్గురు సజీవదహనమయ్యారు. చిత్తూరులోని రంగాచారి వీధిలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్ (65) ఉన్న రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. రెండో అంతస్తులో వారు నివాసం ఉంటున్నారు. రాత్రి నిద్రలో ఉన్న సమయంలో.. పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో మంటలు చెలరేగి.. క్షణాల్లోనే మంటలు రెండవ అంతస్తుకు వ్యాపించాయి.

మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), స్నేహితుడు బాలాజీ (25) చనిపోయారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను చూసి.. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. కానీ అప్పటికే.. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశాక.. స్థానికులు రెండవ అంతస్తులో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారంతా మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
భాస్కర్ కొడుకైన ఢిల్లీబాబు మంగళవారమే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు వచ్చాడు బాలాజీ. అతను కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News