19 ఏళ్ల యువతి కిడ్నాప్.. కాల్చి, యాసిడ్ పోసి దారుణంగా..

జులై 12న 19 ఏళ్ల యువతిని ఆమె ఇంటి నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. యువతి మిస్సింగ్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు..

Update: 2023-07-15 13:38 GMT

19 ఏళ్ల దళిత యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెను తుపాకీతో కాల్చి, యాసిడ్ దాడి చేసి.. దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని బావిలో పడేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో జరిగింది. యువతిని అత్యంత దారుణంగా హతమార్చడంపై.. కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. బీజేపీ, బీఎస్పీ పార్టీల నేతలు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

జులై 12న 19 ఏళ్ల యువతిని ఆమె ఇంటి నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. యువతి మిస్సింగ్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి తల్లి వాపోయింది. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తన కుమార్తె కిడ్నాప్ కు గురైందన్న ఆమె.. అరిచి, ఏడ్చి అందరినీ పిలిచేలోపే కూతురిని దుండగులు ఎత్తుకుపోయారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయకుండా తిరిగి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిపారు. యువతి మృతదేహం శుక్రవారం ఓ బావిలో లభ్యమవ్వగా.. ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి ఆచూకీ కోసం వెతుకుతున్నామన్నారు. బాధితురాలి తల్లి అనుమానితుల పేర్లు చెప్పలేదన్నారు.
కాగా.. కాలేజీకి వెళ్లే యువతిని దారుణంగా హతమార్చడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంతరి వసుంధర రాజే ఈ ఘటనపై ట్వీట్ చేశారు. యువతిపై యాసిడ్ పోసి, తుపాకీతో కాల్చి హతమార్చిన ఘటన హృదయవిదారకంగా ఉందన్నారు. కాగా.. యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. పోస్టుమార్టంలో యువతి మరణానికి కారణం తుపాకీ గుండు అని తెలిసిందని ఎస్పీ మమతా గుప్తా తెలిపారు. కానీ.. యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె బంధువులు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిందితులను కాపాడేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.


Tags:    

Similar News