Gold Prices Today : యుద్ధం ఆగింది.. బంగారం ధర పెరిగింది.. ఎందుకిలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలుపెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. వెండి ధరలు కూడా పైకి చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో యుద్ధంలో బ్రేక్ రావడం, కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు ఇరాన్ - అమెరికాలు చర్చలు జరుపుతుండటంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మదుపుదారులు ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం జరిగినంత కాలం...
పశ్చిమాసియలో యుద్ధం జరిగినంత కాలం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి పై ఎవరూ పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ధరలు దిగి వచ్చాయి. కానీ నేడు మళ్లీ ధరలు ఊపందుకున్నాయి. చర్చలు సఫలమయి యుద్ధం పూర్తిగా నిలిచిపోతే మాత్రం బంగారం, వెండి ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తుండటంతో బంగారం, వెండి ధరల పెరుగుదల ఒకింత వినియోగదారులను ఇబ్బందులు పెడుతుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,39,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,52,360 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,65,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.