Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం.. శాంతించిన వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. నిన్నటి వరకూ పరుగు ఆపి కొంత దిగివచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడే సమయంలో బంగారం ధరలకు మళ్లీ ఊపు రావడంతో కొనుగోలు చేసే వారు ఆందోళనకు గురవుతున్నారు. వెండి ధరలు మాత్రం కొంత శాంతించినట్లు కనపడుతుందన్నాయి. బంగారం ధరలు తగ్గుతాయని అనుకుంటే అది భ్రమే అవుతుందని తొలి నుంచి మార్కెట్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అనేక కారణాలతో ధరల్లో మార్పులుంటాయని, అందుకే బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచించినప్పటికీ ఇంకా ధరలు తగ్గుతాయేమోనని వేచి చూసిన వారికి ఇప్పుడు నిరాశ ఎదురువుతుంది.
అంచనాలు నిజం కావు...
బంగారం విషయంలో ఎప్పుడూ అంచనాలు నిజం కావు. అందుకే ఒకప్పుడు బంగారం, వెండిపై సుస్థిరమైన పెట్టుబడిగా భావించేవారు. కానీ నేడు మాత్రం బంగారం, వెండి విషయంలో మదుపు చేసే వారు మాత్రం జాగ్రత్తలు వహించాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను చూడాలని ఆశపడితే కుదరదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు చాలా వరకూ నష్టపోవాల్సి వచ్చింది. బంగారం మంచి ధర ఉన్నప్పుడే దానిని విక్రయించి ఉంటే నష్టం ఉండేది కాదు. ఇంకా పెరుగుతుందని దురాశ పడినందున భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని అంటున్నారు.
నేటి ధరలు...
ఇక ఈ నెలలోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఇక బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయి. ఈ అంచనాలు నిజమయితే మళ్లీ పది రోజుల క్రితం పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,45,560 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,58,790 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,99,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చుు.