టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి చివరి సమావేశం.. నిర్ణయాలివే

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన

Update: 2023-08-07 11:05 GMT

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. తిరుపతి శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలిమెట్టు వరకు భక్తుల కోసం రూ.4 కోట్ల వ్యయంతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పీఏసీ మరమ్మతు పనులకు రూ.2.5 కోట్లతో కేటాయించినట్లు తెలిపారు. రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు, రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ చేపట్టనున్నారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయించినట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుపతి లోని శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ. 3 కోట్లు పాలక మండలి కేటాయించిందని తెలిపారు. తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.23.50 కోట్లు కేటాయించారు. మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు రూ.3.10 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ. 9.85 కోట్లతో వకుళమాత ఆలయం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు రూ.2.60 కోట్లు కేటాయించారు. ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ. 11.5 కోట్లు, రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు, ఎస్‌వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు టీటీడీ పాలక మండలి కేటాయించింది. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ను టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తూ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటు చేసేందుకు రూ. 1.25 కోట్లు కేటాయించారు.


Tags:    

Similar News