పవన్ కళ్యాణ్ అరెస్టుపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు విన్నారా?

వాలంటీర్లపై జనసేన అధినేత వపన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2023-07-21 10:52 GMT

వాలంటీర్లపై జనసేన అధినేత వపన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప‌వ‌న్ వాలంటీర్ల‌పై దురుద్దేశ్యపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ప్ర‌భుత్వం భావిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పరువుకు నష్టం కలిగించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అంటోంది. వాలంటీర్లలోని మహిళలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని.. వారిని అవమానించేలా, విషపూరిత వ్యాఖ్యలు చేశారని చెబుతోన్న ప్రభుత్వం, ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు ఎంతో బాధపడ్డారని.. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని అన్నారు.
ఏపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ పై పరువునష్టం కేసు పెట్టడం బుద్ధి లేని, నీతిమాలిన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఈ అణచివేత ధోరణి మానుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా? రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు.. ఆ సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం అని చంద్రబాబు విమర్శించారు.


Tags:    

Similar News