Ys Jagan : ఫ్యాన్ స్విచ్ వేసినంత సులువు కాదన్నాయ్.. ముందున్నాయ్.. సమస్యలన్నీ
వైసీపీ అధినేత జగన్ మూడేళ్లు పార్టీని నడపటం అంత సులువు కాదు. కేవలం ఆర్థిక సమస్యలు కాదు. నేతలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది
వైసీపీ అధినేత జగన్ మూడేళ్లు పార్టీని నడపటం అంత సులువు కాదు. కేవలం ఆర్థిక సమస్యలు కాదు. నేతలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. గత ఐదేళ్లలో తాను అవలంబించిన వైఖరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పాలన చేసిందన్న విమర్శలు వినిపించాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టకపోవడం కావచ్చు. టీడీపీకి నిధులు సమకూర్చే వారి పరిశ్రమలపై ఉక్కుపాదం మోపడం కావచ్చు. మైనింగ్ చేసుకుంటున్న అనేక మంది టీడీపీ నేతలకు వందల కోట్ల జరిమానాలు విధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే సమయంలో అనేక మందిపై కేసులు కూడా నమోదు చేశారు.
ట్రెండ్ ఛేంజ్ చేసి...
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒకింత గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో కొంత ఛేంజ్ చేసింది. జగన్ కు అనుకూలమైన సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్లు కనిపించకుండా జగన్ చుట్టూ ఉన్న కోటరీపై మాత్రం వేటు వేస్తుంది. అందుకే అనేక కేసులు జగన్ కు వెన్నంటి ఉన్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. వరస కేసులు నమోదవుతూ నెలల తరబడి జైలులోనే నేతలు మగ్గాల్సి వస్తుంది. కొద్దిగా ట్రెండ్ మార్చిన కూటమి సర్కార్ ఒక కేసులో బయటకు వచ్చినా మరొక కేసును బయటకు తెచ్చి నెలల తరబడి జైలు నుంచి బయటకు రాకుండా చేయడంతో ఒకింత నేతల్లో వణుకు మొదలయింది.
ఆప్తులుగా ఉన్న వారిని...
ఇందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నిదర్శనమంటున్నారు. ఇక జగన్ కు అత్యంత ఆప్తులుగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబంపై కూడా కూటమి సర్కార్ కన్నెర్ర జేసింది. మిధున్ రెడ్డి ఇప్పటికే మద్యం కేసులో జైలుకు వెళ్లారు. తర్వాత పెద్దిరెడ్డి కూడా వెళ్లడం ఖాయమంటున్నారు. మరొక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మద్యం కేసులోనే అరెస్టయ్యారు. ఇలా జగన్ కు దగ్గరగా ఉన్న నేతలను కూటమి ప్రభుత్వం లక్ష్యం చేయడం, వారు జైలుకు వెళుతుండటం జగన్ ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేదేనని చెప్పాలి. న్యాయపరమైన అన్ని రకాలుగా సాయం అందచేస్తున్నప్పటికీ వారి అనుచరుల్లోనూ భయం మొదలయిందనే అంటున్నారు.
జగన్ తో పాటు...
ఇక తర్వాత రోజుల్లో జగన్ కు మిగిలిన సన్నిహిత నేతలపై కూడా వరస కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది. అందులో చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. అందుకే జగన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో నేతలు పాల్గొనేందుకు ఒకింత జంకుతున్నారని అంటున్నారు. మరొకవైపు జగన్ కూడా అరెస్ట్ అవుతారని కూడా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పార్టీని లీడ్ చేసే వారు ఎవరన్న దానిపై కూడా పార్టీలో చర్చ ప్రారంభమయింది. అయితే జగన్ అన్నింటికీ సిద్ధమయ్యారని, ఆయన అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి మానసికంగా రెడీ అయిపోయారని బయటకు అంటున్నా జగన్ కు మాత్రం ఈ నాలుగేళ్ల పార్టీని నడపటం అంతకు ముందు అంటే 2014 నుంచి 2019 వరకూ నడిపినంత సులువు కాదన్నది మాత్రం వాస్తవమనే చెప్పాలి.