Ys Jagan : జగన్ ప్లాన్ మార్చినట్లుందిగా.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో కొన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారని తెలిసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో కొన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయిన తర్వాత వైసీపీని వీడి వెళ్లిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశాలున్నాయి. ఇందుకోసం తేదీలు ఖరారు చేయాలని పార్టీ సీనియర్ నేతలను జగన్ ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా 2024 లో ఓటమి తర్వాత కీలక నేతలు పార్టీని వీడారు. అందుకోసం తొలుత ఆ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ముందుగా ఎక్కడి నుంచి జగన్ తన నియోజకవర్గాల పర్యటన ప్రారంభిస్తారన్నది త్వరలోనే పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.
తొలిదశలో పార్టీ మారిన...
తొలిదశలో పార్టీ మారిన నియోజకవర్గాలతో పాటు రెండో విడతలో అక్రమంగా కేసులు బనాయించి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వైసీపీ నేతల నియోజకవర్గాలకు జగన్ వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇందుకోసం తేదీలను ఖరారు చేయాలని కోరినట్లు తెలిసింది. ముందుగా జగ్గయ్య పేట నుంచి జగన్ పర్యటన ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జగ్గయ్య పేట నియోజకవర్గం నుంచి సామినేని ఉదయ భాను పార్టీ మారిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన తన పర్యటన ప్రారంభిస్తారంటున్నారు. తర్వాత పొన్నూరు నియోజకవర్గానికి, ఆ తర్వాత ఒంగోలు నియోజకవర్గాన్ని పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఏలూరు, భీమవరం నియోజకవర్గాల్లో కూడా జగన్ పర్యటించే ఛాన్స్ ఉంది.
అక్రమ కేసులతో...
తర్వాత అక్రమంగా కేసులు ఎదుర్కొన్న నేతలకు చెందిన నియోజకవర్గాల్లో జగన్ రెండో విడత పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తారంటున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలోనూ సభ పెట్టాలని యోచిస్తున్నారు. దీంతో పాటు సర్వే పల్లి నియోజకవర్గానికి ఆయన వెళతారని తెలిసింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోనూ జగన్ పర్యటన ఉంటుందని అంటున్నారు. చివరిగా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిసింది. జోగి రమేష్, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివిధ కేసుల్లో అక్రమంగా అరెస్టయిన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో పర్యటించాలని డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది.