అమరావతి పనులు...
దీంతో పాటు రాజధాని అమరావతి పనులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం పనులు ఊపందుకోనున్నాయి. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారంటున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో భూముల రేట్లు పెరిగాయి. ఇంటి అద్దెలు కూడా గతంలో కంటే రెట్టింపు అయ్యాయి. దానికి ప్రధాన కారణం టీడీపీ అధికారంలో ఉండటంతో పాటు మంగళగిరి చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టంగా మారింది. ఒకప్పుడు ఐదు వేలు రూపాయలు కూడా రాని ఇంటి అద్దె నేడు డబుల్ కు చేరుకుంది. ఇందుకు కారణం రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడమే.
రాజకీయంగా ఇబ్బందులే...
మరొక వైపు వైసీపీ మంగళగిరిలో రాజకీయంగా ఇబ్బందిపడుతుంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొన్ని నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో కి వెళ్లి తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా యాక్టివ్ కాలేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలిసింది. ఆయన గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. దీంతో మంగళగిరిలో ఇప్పుడు పార్టీని నడిపించే వారు లేరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి పదవులు పొందిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు.
అందరూ వద్దని చెబుతుంటే...
దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు మంగళగిరి సీటు వద్దంటే ఎవరికి ఇవ్వాలన్నది జగన్ కు ఇబ్బంది కరమే. నారా లోకేష్ మీద పోటీ చేసి గెలుపొందడమంటే అంత ఆషామాషీ కాదన్న విషయం అర్థమై కొంత పార్టీకి దూరంగా జరుగుతున్నారని చెబుతున్నారు. జగన్ కూడా మంగళగిరి నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. నారా లోకేష్ ను తట్టుకుని నిలబడగల సమర్థుడైన నాయకుడి కోసం వైసీపీ చూస్తున్నప్పటికీ అది ఫలించేలా కనిపించడం లేదు. ఎవరూ ధైర్యంచేసి ముందుకు రాకపోవడంతో ఒకరిద్దరు సీనియర్ నేతలు ముందుకు వచ్చినా వారి వల్ల ఉపయోగం లేదన్న భావన పార్టీ నేతల్లో వినపడుతుంది. మరి లోకేశ్ కు ప్రత్యర్థి ఎవరు అన్నదానిపై మంగళగిరిలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది.