విభేదాలను పక్కన పెట్టండి : బెజవాడ తూర్పు కార్యకర్తలతో జగన్
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో ఆయన మాట్లాడారు. అందరూ కలసి పనిచేయాలని సూచించారు. విభేదాలను పక్కన పెట్టి అందరం కృషి చేస్తే 175 స్థానాలకు 175 స్థానాలు గెలవడం కష్టమేమీ కాదని జగన్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గురించి వివరించాలని జగన్ కోరారు. తమకు ఓటు వేయని వారి ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వం చేసే మంచిని గురించి వివరిస్తే వారిలో కూడా మార్పు వస్తుందని జగన్ కార్యకర్తలకు సూచించారు.
వచ్చే ఎన్నికలలో గెలిస్తే...
గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని సూచించారు. ప్రతి యాభై నుంచి డెబ్బయి ఇళ్లకు గృహసారథులను నియమిస్తున్నామని, వారిలో ఖచ్చితంగా ఒకరు మహిళలు ఉండాలని తెలిపారు. ప్రజలతో పార్టీ క్యాడర్ మమేకం కావాలని కోరారు. అంతా కలసి పనిచేస్తే కుప్పంలాంటి చోటనే మున్సిపాలిటీను, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు గెలుచుకున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోనూ 21 వార్డుల్లో 14 వార్డుల్లో గెలిచామని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలను అందరూ సీిరియస్ గా తీసుకోవాలని, ఈసారి గెలిస్తే మరో ముప్ఫయి ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు.