Free Bus For Women : ఉచిత బస్సును వారం రోజుల్లో ఎంత మంది ఎక్కారో తెలిస్తే?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు పెద్ద సంఖ్యలో స్పందించారు
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు పెద్ద సంఖ్యలో స్పందించారు. నిజంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు ఒక్కసారిగా పెరిగింది. మహిళలు పూర్తిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చింది. సెలవులు కావడంతో ఒకింత తగ్గినట్లు కనిపిస్తుందని అనుకున్నా గత వారం రోజుల నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి అపూర్వ స్పందన కనిపిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ మహిళలు అధిక సంఖ్యలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్నిసద్వినియోగం చేసుకుంటున్నారు. నిత్యం పనులకు వెళ్లే వారితో పాటు చిరువ్యాపారులు కూడా దీనిని అత్యధికంగా ఉపయోగించుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో...
అసలు విషయం ఏంటంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒక్క తిరుమలకు మాత్రమే ఈ పథకం వర్తించలేదు. అదీ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఘాట్ రోడ్డు ఉండటంతో సీటింగ్ వరకే అనుమతిస్తుండటం, సాంకేతిక కారణాలతో ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు కూడా తెలిపారు. అయితే తాజాగా తిరుమల కొండ వరకూ ఈ పథకాన్ని పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. తిరుమల ప్రయాణానికి ఘాట్ రోడ్డు కారణంగా సీటింగ్ వరకే అనుమతిస్తున్నారు.
వారం రోజుల్లో...
ఇక మహిళలు గతవారం రోజుల్లో దాదాపు ఎనభై లక్షల మంది వరకూ మహిళలు ఈ పథకాన్ని వినయోగించుకున్నారని చెబుతున్నారు. ఒక్క పదహారో తేదీన పది లక్షల మంది, పదిహేడో తేదీన పదిహేను లక్షల మంది, పద్దెనిమిదో తేదీన పద్దెనిమిది లక్షల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారని తెలిపారు. మహిళలకు ఈ పథకం ద్వారా రోజుకు దాదాపు ఆరు కోట్ల రూపాయల మేరకు లబ్ది చేకూరుతుందని లెక్కలు వేస్తున్నారు. అందులోనూ ఫ్రీ జర్నీ టిక్కెట్ ఇస్తుండటంతో ఒక్కొక్క మహిళకు నెలకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకూ ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లెక్కలతో నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు ఆ మేరకు సిద్ధం చేస్తున్నారు.