బలహీన పడినా.. మనకు భారీ వర్షాలే.!

తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా

Update: 2023-07-22 11:38 GMT

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అయితే వర్షాలు ఆగిపోతాయని మాత్రం అనుకోకండని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి రూపంలో దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నెల 22 నుంచి 24 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జులై 25, 26 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని.. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్‌ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వాన కురిసే అవకాశాలున్నాయని.. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News