విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటన.. వారిద్దరిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం

Update: 2022-10-19 00:56 GMT

శనివారం విశాఖపట్నంలో జరిగిన విశాఖ గర్జన సభలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్, కంచరపాలెం సీఐ కృష్ణారావులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వీరిద్దరిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మంత్రులపై దాడి ఘటనలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన 61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. వైజాగ్ ఎయిర్ పోర్టు ఘటనకు దారి తీసిన పరిస్దితులపై ఏపీ ప్రభుత్వం సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం మరోసారి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రకటించింది. అయితే జనసేన కార్యకర్తల్ని వైసీపీయే రెచ్చగొట్టిన్నట్లు జనసేన ఆరోపిస్తోంది.

పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పోలీసులు చూపించిన వ్యక్తి కాకుండా మరొకరు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ తర్వాత వీరిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది.


Tags:    

Similar News