తిరుమల లడ్డూ కల్తీపై విచారణ ప్రారంభం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ విచారణ ప్రారంభించింది

Update: 2026-03-10 06:22 GMT

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ విచారణ ప్రారంభించింది. విచారణ చేసేందుకు కమిషన్‌ త్వరలోనే గతంలో పనిచేసిన కీలక అధికారులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించనుంది. మరోవైపు గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా నిశితంగా పరిశీలించి ఎవరెవరు ఈ పాపంలో పాలు పంచుకున్నారో తేల్చనుంది. అందుకు అవసరమైన పత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నుంచి తీసుకోనుంది. తిరుమలలో లడ్డూ కల్తీకారకులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ జరుగుతుందని అంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరాపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ విచారణ ప్రారంభించింది.

దినేష్ కుమార్ నేతృత్వంలోని...
విశ్రాంత ఐఏఎస్​ అధికారి, కమిషన్‌ ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేసుకు సంబంధించిన దస్త్రాలు పరిశీలిస్తున్నారు. రానున్న పన్నెండు రోజుల్లో పలువురు ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులు, కిందిస్థాయి సిబ్బందిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు ప్రస్తుతం సెలవులో ఉన్న బాలాజీ, తదితరులను కమిషన్‌ త్వరలోనే ప్రశ్నించనున్నట్లు సమాచారం. కల్తీకి కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే ముందు నిబంధనల మేరకు వారి నుంచి వివరణ తీసుకోవాల్సి ఉంది. విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనుంది.


Tags:    

Similar News