కేజీ @3..దారుణంగా పడిపోయిన టమాటా ధర

ధర పెరుగుతుంది కదా అని పంట కోసి.. అమ్మేందుకు మార్కెట్ కు తీసుకొచ్చేలోపే ధరలు గణనీయంగా పడిపోతున్నాయి.

Update: 2022-11-09 05:37 GMT

pattikonda tomato market

అతివృష్టి.. అనావృష్టిలా తయారైంది టమాటా రైతుల పరిస్థితి. ధరలు అమాంతం పెరగడం.. అంతే వేగంగా తగ్గిపోతుండటం.. టమాటా రైతును కన్నీరు పెట్టిస్తున్నాయి. ధర పెరుగుతుంది కదా అని పంట కోసి.. అమ్మేందుకు మార్కెట్ కు తీసుకొచ్చేలోపే ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. తాజాగా టమాటా ధర అమాంతం పడిపోయింది. నిన్న, మొన్నటి వరకూ వ్యవసాయ మార్కెట్లో కిలో రూ.5 పలికిన టమాటా ధర మరీ దారుణంగా రూ.3కి పడిపోయింది. దీనిని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు కానీ.. రైతులకు మాత్రం తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. వినియోగదారులు కొనుగోలు చేయడానికి బయట మాత్రం కిలో టమాటా రూ.15 నుండి రూ.20 వరకూ ఉంది. రాష్ట్రంలో మదనపల్లి తరువాత రెండో అతిపెద్ద మార్కెట్‌ అయిన పత్తికొండ మార్కెట్‌కు రోజుకు 20 లారీల పైచిలుకు టమాటా దిగుబడి అమ్మకానికి వస్తుంది.

20 కిలోలు గల జత గంపలు రూ.70 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేయగా పది శాతం కమీషన్‌ పోను.. పెట్టుబడి కాదు కదా.. కనీసం కూలీ, రవాణా ఛార్జీలు కూడా రావట్లేదు. దీంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడుల సంగతి అటుంచితే.. ఎదురు ఖర్చులు పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం పత్తికొండ మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటామని ప్రకటన చేశారు. అయితే ఆ హామీని అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.





Tags:    

Similar News