Tirumala : తిరుమలకు నేడు వెళ్తున్నారా.. అయితే ఇది గమనించాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. దసరా సెలవులు ముగిసినా, బ్రహ్మోత్సవాలు పూర్తయినప్పటికీ తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. తిరుమలలో అన్ని చోట్ల క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అయితే దర్శన సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తుల రద్దీ నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం హిందువుల నమ్మకం. విశ్వాసం. అందులోనూ ఆధ్మాత్మికత, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్న తిరుమలకు వచ్చేందుకు భక్తులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. శేషాచలం కొండల్లో కొలువు దీరిన ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు తొలగిపోతాయని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే రోజు, సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, వారు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,919 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,218 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.