Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. దసరా సెలవులు ముగిసినప్పటికీ ఇంకా భక్తుల రద్దీ మాత్రం తిరుమలలో కొనసాగుతూనే ఉంది. గత నాలుగున్నర నెలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు బారులు తీరుతున్నారు. హుండీ ఆదాయం కూడా గత నాలుగు నెలల నుంచి రోజుకు నాలుగు కోట్ల రూపాయల వరకూ వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
శుభకార్యాలు జరుగుతుండటంతో...
అయితే ఎక్కువ మంది భక్తులు ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో వాటిని తమ ప్రాంతంలో ముగించుకుని ఏడుకొండల వాడి ఆశీస్సులను అందుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదే సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వసతి గృహాల నుంచి అన్న ప్రసాదం వరకూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్నటి వరకూ బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండేది. నేడు కంపార్ట్ మెంట్లకే పరిమితమయింది. నేడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,424 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 27,872 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.