Tirumala : తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొంచెం కూడా తగ్గలేదు

Update: 2025-10-15 03:09 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొంచెం కూడా తగ్గలేదు. తిరుపతిలో ఎస్.ఎస్.డి టోకెన్లు విడుదల చేసే శ్రీనివాసం వద్ద ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకున్న వారికి సత్వరం దర్శనం అవుతుండటంతో ఈ టోకెన్లు తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతిలోని టోకెన్లు జారీ చేసే ప్రాంతాల్లో వేచి ఉన్నారు. మరొకవైపు అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా వాహనాల తనిఖీ కొంత ఆలస్యమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. భక్తుల సంఖ్య గత కొద్ది నెలల నుంచి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మే 15వ తేదీన ప్రారంభయిన భక్తుల రద్దీ నేటి వరకూ తిరుమలలో కొనసాగుతుంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. గడిచిన తొమ్మిది నెలల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకూ హుండీ ఆదాయం లభించిందని, నెలకు 120 కోట్ల రూపాయల వరకూ శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు ఎంత మంది వచ్చినా వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,473 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,900 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News