తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. తిరుమల శ్రీవారిని ఆదివారం

Update: 2023-09-04 03:22 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. తిరుమల శ్రీవారిని ఆదివారం 81,459 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి 32,899 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. శ్రీ‌వారి హుండీ ఆదాయం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఆదివారం నాడు రూ. 4.05 కోట్ల రూపాయ‌లు ఆదాయం వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) తెలిపింది. తిరుమ‌ల‌లోని 26 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు దర్శ‌నం అయ్యేందుకు క‌నీసం 24 గంట‌ల‌కు పైగా ప‌డుతోంది.

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 5వ తేదీ సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 6న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. సెప్టెంబ‌రు 7న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శేషుబాబు, వెంక‌ట స‌తీష్ కుమార్‌,శంక‌ర్, ఉద‌య భాను, అమోల్ కాలే ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు లోక‌నాథం, కస్తూరి బాయి.. ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News