Ap Politics : వారికి టీడీపీలోకి నో ఎంట్రీ... కానీ కమలం పార్టీ కండువా కప్పేస్తుందే?
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన వారిని తెలుగుదేశం పార్టీ దగ్గర చేర్చుకోవడం లేదు
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన వారిని తెలుగుదేశం పార్టీ దగ్గర చేర్చుకోవడం లేదు. కొందరు కీలక నేతలను మాత్రమే పార్టీలోకి తీసుకునేందుకు అనుమతిస్తున్నారు తప్పించి అందరినీ చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంలో లేదు. వైసీపీలో ఉన్నప్పడు తెలుగుదేశం పార్టీపైన, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలకు మాత్రం టీడీపీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. అయితే తిరిగి వారు వైసీపీ గూటికి వెళ్లకుండా టీడీపీ ప్రత్యామ్నాయ మార్గాన్ని వారికి సూచించినట్లు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ చేర్చుకోని ఎమ్మెల్సీలను బీజేపీలో చేరుస్తూ నయా ట్రెండ్ కు తెరలేపినట్లు కనిపిస్తుంది. బీజేపీ కూడా పెద్దగా ఆలోచించకుండానే పార్టీ కండువా కప్పేస్తుంది.
రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో...
వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీలో చేరి తిరిగి పెద్దల సభలో స్థానం పొందడానికి రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ రాజీనామాలను మాత్రం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ఇంత వరకూ ఛైర్మన్ మాత్రం వారి రాజీనామాల విషయంలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజీనామాలు ఆమోదించి ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు జరిగితే అవి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఖాతాలో పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శాసనసభలో వైసీపీ సభ్యుల సంఖ్ పదకొండు మాత్రమే కావడంతో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమి ఖాతాలోకే వెళుతుంది.
జకియా ఖానమ్ బీజేపీలోకి ...
ఈ సమయంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానమ్ ఎమ్మెల్సీకి, వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లాలో అనేక మంది నేతలున్నప్పటికీ నాడు మైనారిటీ వర్గమని భావించి జకియా ఖానమ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా ఆమెకు డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవిని కేటాయించారు. 2020లో జకియాఖానమ్ ను ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. వచ్చే ఏడాది ఈ పదవి ఖాళీ కానుంది. అయితే జకియా ఖానమ్ తిరుమల దర్శనాల విషయంలో వివాదంలో చిక్కుకోవడంతో టీడీపీ, జనసేన పార్టీలు దూరం పెట్టాయి. దీంతో జకియా ఖానమ్ కూటమి పార్టీలోని మిత్రపక్షమైన బీజేపీలో చేరారు. ఆమెకు రాష్ట్ర బీజేపీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పోతుల సునీత కమలం పార్టీలోకి...
అలాగే తాజాగా మరో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పోతుల దంపతులు బీజేపీలో చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కోటాలో గెలిచిన పోతుల సునీత రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భావించినప్పటికీ ఆమె చేరికకు తెలుగుదేశం పార్టీ నేతలే అడ్డుపడ్డారు. పార్టీ అధినేతపై చేసిన విమర్శలతో ఆమెను పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన టీడీపీ నాయకత్వం పోతుల సునీత చేరికకు బ్రేక్ వేసింది. దీంతో ఆమె కూటమిలోని బీజేుపీలో చేరారు. 2017లో తొలిసారి టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచినా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయిన తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ప్రయత్నించి విఫలమై బీజేపీలో చేరారు.