Janasena : అన్నామంటే అన్నారంటారు కానీ..? జరుగుతున్నదిదేగా?
జనసేన పార్టీలో కిందిస్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది
జనసేన పార్టీలో కిందిస్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల కొందరు మౌనంగా ఉండి నిరసన తెలుపుతుండగా, మరికొందరు మాత్రం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నించేవారిపై మాత్రం జనసేన వేటు వేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని మానేసి వాస్తవ విషయాలను ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కేవలం ఒక్క ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన మనోవేదన ఇలాగే ఉంది.
నాయకుల్లో అసంతృప్తి...
ఆ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన నేత ఒకరు తాము గత ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసుకుని ఆర్థికంగా నష్టపోయామని, అప్పుల ఊబిలో కూరుకుపోయాయమని తమకు పదవులు ఇవ్వకపోగా, కనీసం కాంట్రాక్టు పనులు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన చెందారు. ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ కి అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో రోడ్ కం రైల్వే బ్రిడ్జి దగ్గర కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం పార్టీలో కలకలం రేపింది. 14 సొసైటీలకు గాను. 13 టిడిపికి . 1 జనసేనకు కేటాయించారని, ఇది పొత్తు ధర్మమా అని కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి టీవీ రామారావు ప్రశ్నించారు.
పదవి నుంచి తప్పించి నంత మాత్రాన...
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ ఇదే పొత్తు ధర్మం పాటిస్తే జనసేన పరిస్తితి ఏమిటి కొవ్వూరు నియోజకవర్గమలో జనసేన మనుగడ ఉండకూడదు అని కొంతమంది టీడీపీ నాయకుల ఆలోచన అని అన్నారు. అయితే దీనికి సంబంధించిన సీరియస్ అయిన జనసేన నాయకత్వం పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించింది. జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా టీవీ రామారావు వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలతో ఆయన ఆందోళనకుదిగడం జనసేన సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఆయనను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం నియామవళిని ఉల్లంఘించడమేనని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ లేఖలో తెలిపింది.
పొత్తు ధర్మం పాటించకపోతే...
ఈ వేటు వేయడంతో పార్టీ నేతలు కాస్త ఆగడం అయితే జరగొచ్చేమో కానీ.. కనీసం నేతల బాధలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నాయకత్వానికి మాత్రం సరైన సమయంలో హ్యాండ్ ఇవ్వడానికి కూడా నేతలు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. కేవలం పొత్తు ధర్మంలో భాగంగా రావాల్సిన వాటాను గురించి అడిగితే దానికి ఆగ్రహం ఎందుకని? కూటమి లో పొత్తు ధర్మాన్నిపాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందని అంటున్నారు. ఎంతమందిపై ఇలా వేటు వేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుంది. గత ఎన్నికల సమయంలో అందరం సమిష్టిగా పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు వచ్చిందని గుర్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించేలా టీడీపీపై వత్తిడి తెస్తారా? లేదా? అన్నది చూడాలి. లేకపోతే క్యాడర్ తో పాటు లీడర్లు కూడా జెండాకు దూరమయ్యే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వేటు వేయడం సొల్యూషన్ కాదని, అక్కడ సమ్యను పరిష్కరించే ప్రయత్నాన్ని పవన్ చేయాలని కోరుతున్నారు.