Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే దర్శనానికి ఎంత సేపు వెయిట్ చేయాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2025-09-27 04:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్ లో ప్రయాణం ప్రమాదకరమని, నిదానంగా కొండపైకి వాహనాల ద్వారా చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది.

బ్రహ్మోత్సవాలు కావడంతో...
ముందుగా బుక్ చేసుకున్న వారే ఎక్కువ సమయం వసతి గృహాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మోత్సవాలుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తుల తరలి వస్తారని తెలిసి అందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దసరా సెలవులు కూడా తోడవ్వడంతో భక్తుల అధిక సంఖ్యలో వస్తుండంతో క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదం, మజ్జిగ, పాలు వంటి వాటిని పంపిణీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,358 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,166 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.58 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.





Tags:    

Similar News