Rain Alert : పగలు అదిరిపోయే ఎండ.. సాయంత్రానికి పిడుగులతో కూడిన వర్షం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ తీవ్రత, రాత్రి వేళ వర్షంతో విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకూ గత కొద్ది రోజులుగా అదే పరిస్థితి ఏర్పడింది. అనేక జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ తో అప్రమత్తం చేసింది. ఒకవైపు ఎండ మరొకవైపు వర్షంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను కోల్పోతున్నారు.
ఈ జిల్లాల్లో వర్షం...
హైదరాబాద్ వాతావరణం జారీ చేసిన అలెర్ట్ ప్రకారం పలు జిల్లాల్లో నేడు కూడా వర్షం పడే అవకాశముందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్టంగా పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలోనూ...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి వాతావరణమే నెలకొనే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా పలుచోట్ల సంభవిస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో రైతులు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.