Janasena Party : పవన్ పార్టీ ఎదగడానికి ఎంతదూరం?
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల పరిస్థితులు వేరు. 2029లో జరగబోయే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే 2024కు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నడూ అధికారంలో ఉండలేదు. అదే సమయంలో ఆయనపై జనంలో కూడా బాగా హోప్స్ ఉన్నాయి. పవన్ కల్యాణ్ నీతి మంతుడు. నిజాయితీ పరుడు. రాజకీయాల్లో అవినీతి చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అదే నిజం. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారానే తన ఆదాయాన్ని సంపాదించుకుంటారు. ఒక్క సినిమా చేస్తే చాలు పార్టీని ఏడాది పాటు నడపటానికి అవసరమైన డబ్బులు సమకూరుతాయి.
ఇతర నేతలకు భిన్నంగా...
అందులో పవన్ కల్యాణ్ కు, రాజకీయ నేతలకు మధ్య చాలా తేడా ఉంది. ఏదో చేయాలని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. వారసత్వంగానో లేక రాజకీయాల్లో పదవులు సంపాదించుకుని సొమ్ములు మూటగట్టుకుందామన్న ధ్యాస కూడా లేదు. తాను ఫీలయితే సొంత డబ్బులు అయినా ఇచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపడంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముందుంటారు. అటువంటి పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జోడీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తుందని ఆశించారు. అయితే అనేక కారణాలు ఆయన కాళ్లకు బ్రేకులు వేశాయనే చెప్పాలి.
పథ్నాలుగు నెలల నుంచి...
ఎందుకంటే గత పథ్నాలుగు నెలల నుంచి పవన్ కల్యాణ్ తనకు బాధ్యత అప్పటించిన మంత్రిత్వ శాఖలో విజయం సాధించినప్పటికీ, ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఆశించిన రీతిలో పనితీరు లేదన్నది ప్రజాభిప్రాయంగా వినిపిస్తుంది. ఏ విషయంలోనూ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చెప్పే పనికి దూరంగా ఉంటుండటంతో కొంత పవన్ ఇమేజ్ రాజకీయంగా డ్యామేజీ అయిందనే చెప్పాలి. అయితే పవన్ కల్యాణ్ అంటే నేటికీ అభిమానమున్న జిల్లాలు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ కూడా 2024 ఎన్నికల కంటే ముందున్న పరిస్థితులకు భిన్నంగా మారాయి. అయినా రెండు జిల్లాల్లోనే నేటికీ పవన్ కల్యాణ్ పార్టీ బలంగా ఉండటంతో మిగిలిన జిల్లాల్లో బలహీనంగా ఇప్పటికీ కొనసాగుతుండటంతో రానున్న ఎన్నికల నాటికి పవన్ రంగంలోకి దిగి మార్చకపోతే మరింత దిగజారే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.