తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. భారీ వర్షానికి మహిళ మృతి

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా..

Update: 2023-05-12 04:34 GMT

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంటుంది. ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు ఎండలు కూడా తీవ్రతరం అవుతున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, గురువారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడింది. శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫానుగా మారి 14న మయన్మార్ తీరాన్ని తాకనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఎండలు విపరీతంగా పెరగనున్నాయి. నేటి నుంచి 2-4 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, తెలంగాణలోనూ 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్రమైన వడగాల్పులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకూ బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. అలాగే పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
ఈ ఉదయం ఏపీలోని ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు నేలకూలాయి. పి.కన్నాపురంలో చెట్టుకొమ్మ కూలి ఆదిలక్ష్మి అనే మహిళ మరణించింది. పలు ప్రాంతాల్లో ఇంటి పై కప్పులు ఎగిరిపోగా, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. అధికారులు అప్రమత్తమై పోలవరం కాపర్ డ్యామ్ కు గండికొట్టారు.


Tags:    

Similar News