నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు హాజరవుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ అజెండాను పేర్కొనగా, దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.
నీటి ప్రాజెక్టులపై...
తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టకు 80 టీంఎంసీలు, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టుపై కూడా చర్చించాలని కోరుతుంది. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. బనకచర్లపై అసలు చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభు్వ తెలిపింది. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘనే బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొంది. దీంతో సమావేశంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.