Andhra Pradesh Alliance Parties : అసలు అదొకటుందని గుర్తుందా.. అధ్యక్ష్యా?
ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని అందులో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు డిసైడ్ చేశాయి.
ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలకు మూడు పార్టీలు కలసి పోటీ చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి గత ఎన్నికల్లో బరిలోకి దిగి 164 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నాయి. కూటమి ఏర్పడిన తర్వాత మూడు పార్టీల అగ్ర నేతలు కలసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని అందులో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేశాయి. రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీని కూడా మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. మూడు పార్టీల నుంచి ముఖ్యమైన ఇద్దరు నేతల చొప్పున రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు మాత్రమే ఈ సమన్వయ కమిటీ పనిచేసింది.
ఎన్నికల ముందు వరకే....
ఎన్నికల సమయంలో పొత్తులు, వివాదాలు, సీట్లు రాకపోవడంతో అలకలు వంటి వాటిపై ఈ సమన్వయ కమిటీ దృష్టి పెట్టి జిల్లాల వారీగా పర్యటించి వాటిని సమర్ధవంతంగా విభేదాలను అణిచివేయగలిగింది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకూ కలసి కట్టుగా పనిచేసి పార్టీల అభ్యర్థులు విజయం సాధించడానికి సమన్వయ కమిటీ దోహదపడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఇతర పార్టీల నుంచి ఎవరినైనా చేర్చుకోవాలనుకుంటే అందులో సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మూడు పార్టీలు సమన్వయ కమిటీ విషయమే మర్చిపోయారు.
తలెత్తిన విభేదాలు...
దీనివల్ల మూడు పార్టీల్లో నియోజకవర్గ స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ మాదిరిగానే జిల్లా స్థాయులోనూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి నిర్ణయం కార్య రూపం దాల్చలేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. కేవలం ఇన్ ఛార్జుల మంత్రులు మాత్రమే నేతల మధ్య విభేదాలను పరిష్కరించాల్సి వస్తుంది. అయితే ఇది సరిపోదని, జిల్లా స్థాయిలో మూడు పార్టీలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని కూడా యాక్టివ్ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తమ గెలుపునకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకే పదవులు, కాంట్రాక్టులు దక్కేలా చూస్తుండటంతో మిగిలిన రెండు పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి కమిటీని యాక్టివ్ చేయడంతో పాటు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది.
సమన్వయం కోసం...
జనసేన పార్టీతో సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అచ్చన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా నియమితులయ్యారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన, టీడీపీ మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పని చేస్తుందని నాడు తెలిపింది. జనసేన నుంచి కూడా నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరి నేతలు నియమించారు. ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించినా ఎన్నికలు, పొత్తు, దాని తర్వాత మాత్రం అది కనుమరుగవ్వడంతోనే ఇప్పుడు పార్టీల్లో కిందస్థాయి నేతల మధ్య సఖ్యత లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.