TDP : గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో తెలుసా.. దాచిపెడుతున్న వారెవరు?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చంద్రబాబుకు చేరకుండా కొందరు అడ్డుపడుతున్నారన్నవిమర్శలున్నాయి
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చంద్రబాబుకు చేరకుండా కొందరు అడ్డుపడుతున్నారన్నవిమర్శలున్నాయి. తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది పార్టీ నాయకత్వానికి తెలియడం లేదా అంటే లేదనే సీనియర్ నేతలు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయిలో నియమించి నెలవారీ జీతాలు చెల్లించి పెట్టుకున్న వారు సయితం పెద్దగా యాక్టివ్ గా లేరని సాక్షాత్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ లు కేవలం కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయంలోని మూడో అంతస్తు నుంచి వచ్చే నివేదికలను చూసి సంబపరపడుతున్నారని, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారని కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు.
కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లోనూ...
దీంతో పాటు అధికారులు తీసుకుంటున్నారో.. లేక మంత్రుల నిర్ణయమో తెలియదు కానీ.. వైసీపీ నేతలకు, కాంట్రాక్టర్లకు పనులు బాగా ఈ కూటమి ప్రభుత్వంలో అవుతున్నాయన్న ఆవేదన కూడా కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ ఉంది. ఆ విషయం కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ ఇప్పుడు టీడీపీ హయాంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడాన్ని వారు అభ్యంతరం చెబుతున్నారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందన్నది చంద్రబాబుకు తెలిసి జరుగుతుందా? లేక తెలియక జరుగుతుందా? అని నెట్టింట్లో కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
తిరుమల దర్శనాలకు...
ఇక తాజాగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలకు వచ్చినప్పుడు వైసీపీ నేతలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనాలు చేయించడం కూడా సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు చంద్రబాబు, లోకేశ్ కు చేరకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా?అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ లు క్యాడర్ కోసం, పార్టీ కోసం కష్టపడిన వారి కోసం నిచేస్తామంటుంటే అందుకు విరుద్ధంగా పనులు జరుగుతుండటం పట్ల కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తి వ్యక్మవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు పాలనలో ఏం జరుగుతుందో సరి చూసుకోవాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు.