Chandrababu : న్యాయమూర్తికి లేఖ.. తన హత్యకు కోట్లు చేతులు మారాయంటూ

ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 25న ఆయన లేఖ రాశారు

Update: 2023-10-27 06:07 GMT

ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 25న ఆయన లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఆయన లేఖను పంపారు. తన భద్రతపై అనేక అనుమానాలున్నాయని చంద్రబాబు తాను రాసిన లేఖలో వ్యక్తం చేశారు. కొందరు మావోయిస్టులు తన హత్యకు కుట్ర చేసినట్లు అనుమానం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఒక అజ్ఞాత వ్యక్తికి లేఖ వచ్చినట్లు తన వద్ద సమాచారం ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తనను హత్య చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కొన్ని అవాంఛనీయ సంఘటనలు...
రాజమండ్రి జైలులో కొన్ని అవాంఛనీయ సంఘటనలను మీ దృష్టికి తీసుకురావాలని తాను అనుకుంటున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. జడ్ ప్లస్ కేటగిరిలో ఉండే తనకు ప్రాణహాని కల్పించడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. తనను సెప్టంబరు 10వ తేదీన జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారని, తీసుకు వచ్చిన సమయంలోనూ తన ఫొటోలు బయటకు వెళ్లాయని ఆయన తెలిపారు. ఈ ఫుటేజీ పోలీసులే స్వయంగా లీకేజీ చేసినట్లు తనకు అనుమానం కలుగుతుందన్నారు. సోషల్ మీడియాల్లోనూ ఈ ఫొటోలు, వీడియోలు ప్రసారమయ్యాయని లేఖలో చంద్రబాబు తెలిపారు.
మూడు పేజీల లేఖను..
మొత్తం మూడు పేజీల లేఖను రాశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. రాజమండ్రి జైలుపై డ్రోన్ ఎగిరిందని చెప్పారు. అలాగే తనకు కలిగే అనుమానాలు కూడా అందుకు ధృవీకరిస్తున్నాయని తెలిపారు. తన భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోనందున అనుమానాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. ఈ లేఖపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఇంత వరకూ ప్రయత్నం చేయలేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అనేక అనుమానాల మధ్య రాజమండ్రి జైలులో ఉంటున్న తన భద్రతపై ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News