సదాశివరాయలనాటి వలయ వామన స్తంభ శాసనం జంపని గొడుగుపాలుని శాసనం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి సమీపంలోని రేపల్లె రహదారికి సమీపంలో జంపని యడవూరు గ్రామాల నడుమ వలయ వామన స్తంభ శాసనాన్ని చరిత్ర అన్వేషకుడు నల్లగొర్ల వేదాద్రి గుర్తించాడు.

Update: 2024-05-03 15:01 GMT

సదాశివరాయలనాటి వలయ వామన స్తంభ శాసనం

జంపని గొడుగుపాలుని శాసనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి సమీపంలోని రేపల్లె రహదారికి సమీపంలో జంపని యడవూరు గ్రామాల నడుమ వలయ వామన స్తంభ శాసనాన్ని చరిత్ర అన్వేషకుడు నల్లగొర్ల వేదాద్రి గుర్తించాడు.

శాసనాన్ని శ్రీరామోజు హరగోపాల్ చదివి శాసనపాఠం వివరించాడు. ప్రముఖ చరిత్రకారుడు, స్థపతి ఈమని శివనాగిరెడ్డిగారు శాసనపాఠాన్ని, చారిత్రక సమయాలను నిర్ధారించారు.

శాసనపాఠం:

....వర్ష

1466 లగు

...శు 14..శ్రీ రాజాధిరాజ....

(పర)మేశ్వర శ్రీ వీర ప్రతాప సదాసి(వ)

....దేవ మహారాయలు విజయనగర....

....డు రత్న సింహ్వాసనారూఢులై....

...వి సాంమ్రాజ్యదేయుచుంన ఆ...

....(జ)సగోత్ర..మ వంశోద్భవులైన శ్రీ ...

...హామండలేశ్వర రామరాజ వెం(క)

(టా)ద్రి దేవమహారాజులుగారి నాయంక(ర)

....నకు పాలించన (వదంచి) కొండవీటిసిమ...

.......(జం)పని ప్రతినామధేయ శ్రీ రంగరాజ

(పు)రమనెడి అగ్రుహారపు పొలిమేర వలయ వామన శాసన స్తంభం...




శాసన సారాంశం:

శక సం. 1466 అంటే 1544లో రాజాధిరాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప సదాశివదేవ మహారాయలు (క్రీ.శ. 1542-1576) విజయనగర రత్నసింహాసారూఢులై సామ్రాజ్యపాలన చేస్తున్నపుడు ....జసగోత్ర...వంశోద్భవులైన మహామండలేశ్వర రామరాజ వెంకటాద్రిదేవ మహారాజులంగారి(అళియరామరాయులు చిన్న తమ్ముడు) నాయంకరం ఏలిక. కొండవీటిసీమలోని జంపని ప్రతినామధేయం కలిగిన శ్రీరంగరాజపురమనే అగ్రహారపు పొలిమేరలో వామన శాసనస్తంభం వేయబడినది. శాసనం కింద గొడుగుపట్టుకున్న వామనుని శిల్పం ఉంది. గొడుగుపాలుడే వామనుడని భావించబడుతున్నాడు.

జొంపడు అనే రెడ్డి పాలించడంవల్ల శ్రీరంగరాజపురానికి జంపని అనే ప్రతినామధేయం ఏర్పడ్డదని జంపని కైఫీయ్యత్తులో వుంది.

తిమ్మానాయునిపేట కైఫీయత్తులో వలయశాసనం 5సార్లు, వామనముద్ర 2సార్లు పేర్కొనబడ్డాయి.

కోడూరు కైఫీయత్తులో వలయ వామన ముద్ర స్తంభం అని ఉన్నది.

పై శాసనంలో ‘వలయ’, ‘వామన’ లు పేర్కొనబడ్డాయి. కర్ణాటకలో వామనకల్లు అంటారు.

అనుబంధం: గొడుగుమర్రి కేశవుడి పొన్నంపల్లె పొలిమేర , జమ్మలమడుగు దగ్గర పొట్టిపాడు, గండికోట రిజర్వాయర్లో మునిగిపోయిన కొన్ని ఊర్లు ఓబులాపురం, గండ్లూరు, మురపందిలలో ఇటువంటి శాసనాలు దొరికాయి. గండికోట, తాడిపత్రి చుట్టుప్రక్కల ఊర్ల కైఫీయత్తులో వీటిని వామన ముద్ర వలయ శాసనాలు అన్నారు.

ఊరికి నాలుగు దిక్కులు, ఎనిమిది మూలలలో వీటిని ఉంచుతారు. బ్రాహ్మలు దానం పొందిన సరిహద్దుల్లో ఇవి వుంటాయి. ఊరి పేరు, బ్రాహ్మణుడు పేరు, దేవుడి పేరు కన్న శాసనాల మీద రే ఎక్కువ ఏమి ఉండదు. కడప శాసనాలలో ఎక్కడా పెద్ద శాసనాలు రికార్డ్ కాలేదు. కైఫీయత్తులలో కూడా లేవు పెద్ద శాసనాలు.

తిరుమల రామచంద్ర గారి హంపి నుండి హరప్పా దాకా లో గొడుగుపాలుడు కథ ఉన్నది.

కొల్లిపర తామ్ర శాసనం శక సం.1465, శోభకృత్ సం. భాద్రపదమాసం బ.షష్టీ మంగళవారంనాడు సదాశివ మహారాయపురమను నామాంతరమున్న కొల్లిపర గ్రామం దానం చేయబడ్డది. సదాశివదేవరాయల వారి కోనేరి తిమ్మరాజు విన్నపం పాలించి నానాశాఖలకు, నానాగోత్రసూత్రాలకు చెందిన బ్రాహ్మణులకు కొల్లిపర గ్రామం దానం చేయబడ్డది. కొల్లిపర తామ్రశాసనం యడవూరు శాసనం కన్న ఒక యేడు ముందర వేయబడ్డది. పాలకుడు సదాశివరాయలే.

శాసనం గుర్తింపు, ఫోటో: నల్లగొర్ల వేదాద్రి, 9346776582

శాసన పరిష్కారంలో కైఫీయత్తులు, చారిత్రక విషయ వివరాలందించిన

డా. ఈమని శివనాగిరెడ్డి, చౌడం పురుషోత్తం, మణిమేళ శివశంకర్ గారలకు ధన్యవాదాలు

శాసన పరిష్కరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Tags:    

Similar News