Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా.. అయితే హై అలెర్ట్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2025-10-25 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అలెర్ట్ అయ్యారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. భారీ వర్షాలు, తుపాను ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఘాట్ రోడ్ లో వ్యక్తిగతంగా ప్రయివేటు వాహనాల్లో వచ్చే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఘాట్ రోడ్ లో కొండ చరియలు విరిగిపడే అవకాశముందని, జాగ్రత్తగా ప్రయాణం సాగించాలని సూచిస్తున్నారు.

బయట వరకూ క్యూ లైన్...
తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. గతంలో మాదిరి ఒక రోజుకో, మరొక సీజన్ కో పరిమితమయి ఉండటం లేదు. భక్తులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకుని తిరుమలకు చేరుకుని ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర ఉంటున్నాయి. అయితే క్యూ లైన్ లో ఉన్నవారందరికీ మజ్జిగ, మంచినీరు, అన్నప్రసాదం, పాలును పంపిణీ చేస్తున్నామని, వారికి ఏ సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయాయి. బయట రెండు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,110 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,695 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News