Tirumala : శుక్రవారం .. తిరుమలకు వెళుతున్నారా.. అయితే మీకు అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు రోజులు వీకెండ్ కావడంతో పాటు శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మంచిదని భావించి వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో మిగిలిన రోజుల్లోనూ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తమిళనాడు నుంచి...
తిరుమలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు ప్రతి రోజూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం తమిళనాడులో పెరటాసి మాసం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు తమిళనాడు నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇక ప్రతి రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో దొరుకుతుందని భావించి తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఎంత మంది భక్తులు వచ్చినా వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,521 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,101 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.