Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గేదెప్పుడు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీపావళి పండగకు వరస సెలవులు రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. గత కొన్ని నెలలుగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో రద్దీ తగ్గడం లేదు. బయట క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నిత్యం రద్దీగానే...
తిరుమల గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులతో నిత్యం రద్దీగా మారుతుంది. తిరుమలకు వెళ్లాలంటే ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా వివాహాలు, శుభకార్యాలు చేసుకుని తిరుమలేశుడిని దర్శించుకోవాలంటే తిరుపతిలో ప్రతి రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లను మంజూరు చేస్తుండటంతో దీనికి కూడా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉందని, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ అతిథి గృహం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,304 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.