Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీని చూస్తే.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. అదే సమయంలో రేపు వినాయక చవితి పండగ ఉండటంతో ప్రజలు తిరుమలకు రావడం తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే నిన్నటితో పోలిస్తే నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వినాయక చవితి పండగ తర్వాత తిరిగి తిరుమలలో రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ తక్కువగానే ఉండటంతో వసతి గృహాలు కూడా సులువుగానే లభిస్తున్నాయి.
వచ్చే భక్తులు...
తిరుమలకు ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు చేరుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లను జారీ చేస్తుండటంతో వాటిని తీసుకుని వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరొకవైపు కాలి నడకన వచ్చే భక్తులు సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,767 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,852 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.