Tirumala : ఈరోజు తిరుమలలో దర్శనం కోసం ఎన్ని గంటల వేచి ఉండాలో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకూ బయట వరకూ విస్తరించి ఉన్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, పాలు, మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ల వద్ద మొత్తం పన్నెండు కేంద్రాలను ఏర్పాటు చేసి మరీ వీటిని పంపిణీ చేస్తున్నారు.
దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు...
శుక్రవారం కావడంతో సహజంగా తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా శని, ఆదివారాలు కూడా అంతే స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటారు. వసతి గృహాల కేటాయింపు వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారితో పాటు కాలి నడకన వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అందువల్లనే రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపో్యాయి. శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నాలుగు నుంచి ఐదు గంటల వరకూ శ్రీవారి దర్శనం అవుతుంది. నిన్నతిరుమల శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,728 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.