Tirumala : గోవిందా.. శనివారం తిరుమలకు వెళ్లే వారికి దర్శనం ఇంత సమయమా?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం పెరిగిన రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. శనివారం వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటే మంచిదని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అందుకే శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ కూడా కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ మూడు రోజుల పాటు భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
రద్దీ పెరగడంతో...
మొన్నటి వరకూ తిరుమలలో రద్దీ తక్కువగా ఉండటంతో తిరిగి సిఫార్సు లేఖలను అనుమతించడం కూడా ఒక్కసారిగా రద్దీ పెరగడానికి కారణమయింది. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు క్యూ లైన్ లో ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండటంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు కూడా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ కాంప్లెక్స్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,970 దర్శించుకున్నారు. వీరిలో 33,871 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.