Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం.. దర్శనం సమయం ఎంతో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధికి శుక్ర, శని, ఆదివారాలు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులో నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మరొకవైపు భారీ వర్షాలు పడుతున్నప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదంటున్నారు. అయితే భక్తులు ఎంతమంది వచ్చినా అవసరమైన ఏర్పాట్లు, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కొన్ని నెలల నుంచి...
తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువగా ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతూనే ఉంది. గత మూడు నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన రద్దీ అప్పుడప్పుడు కొంత తగ్గినప్పుడు అనిపిస్తున్నా ఎక్కువ రోజులు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గృహాలను కల్పించే విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.
ఇరవై నాలుగు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,530 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,478 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.