Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ... శిలాతోరణం వరకూ వేచి ఉన్నభక్తులు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. దీంతో పాటు నేటి నుంచి సిఫార్సు లేఖలను అనుమతించడ వల్ల కూడా భక్తుల రద్దీ ఎక్కువయింది. నిన్న మొన్నటి వరకూ సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంతో పాటు పాక్ - భారత్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. క్యూ లైన్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. భక్తులు సులువుగా దర్శనం చేసుకుంటున్నారు. అయితే వేసవి రద్దీ కోసం తీసుకున్న నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమీక్షించి వెనక్కు తీసుకున్నారు.
రద్దీ ఎక్కువగా ఉన్నా...
నిన్నటి నుంచి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారు. నేటి నుంచి వారికి దర్శనం లభిస్తుంది. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరొకవైపు భారీ వర్షాల వల్ల కూడా తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. శిలాతోరణం వరకు క్యూలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 14 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,208 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,951 భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులుతెలిపారు.