Tirumala : తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ గురువారం కూడా ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ గురువారం కూడా ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో పాటు వేసవి సెలవులు పూర్తి కావడం, ఎంసెట్ ఫలితాలు కూడా రావడంతో మంచి ర్యాంకులు, ఉత్తీర్ణులయిన వారు వారి తల్లిదండ్రులతో వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ ఎటూ ఉండనే ఉంది. కొత్తగా పెళ్లయిన జంటలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు చేరుకోవడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కొద్ది రోజులుగా రద్దీ...
గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటున్నారు. సిఫార్సు లేఖలను కూడా అనుమతిస్తుండటంతో పాటు వేసవి రద్దీ కూడా తోడవ్వడంతో తిరుమలలో గత కొన్ని రోజులుగా రద్దీ పెరిగింది. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించిన వెంటనే అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ భక్తుల క్యూలైన్ విస్తరించింది. బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,964 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,125 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.