Tirumala : తిరుమల దర్శనం దుర్లభమేనా? సమయం ఎంత పడుతుందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తిరుమలలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో గత కొద్ది రోజులుగా నిండిపోయాయి. బయట కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ విస్తరించి ఉండటంతో వారికి అవసరమైన అన్నప్రసాదాలను, మజ్జిగ, పాలను శ్రీవారి సేవకులచేత పంపిణీ చేస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
వసతి గృహలు...
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో కొండ మీద వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగానే మారింది. అందరికీ అందుబాటులో ఉండే వసతి గృహాలు ఖాళీ కావడం లేదు. ఒక్కొక్క కుటుంబానికి దర్శనం కాకపోతుండటంతో వసతి గృహాలను ఒకరోజులో ఖాళీ చేయడం లేదు. మరొక రోజు ఎక్స్ టెన్షన్ చేసుకుంటుండటంతో ఆరోజు వచ్చిన వారికి వసతి గృహాలు దొరకడం లేదని భక్తులు వాపోతున్నారు. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే పద్ధతిలో వసతి గృహాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,890 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.88 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.