Tirumala : తిరుమలకు వెళ్లే వారు జాగ్రత్త.. ఈరోజు వెయిటింగ్ సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లను మంజూరు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో పాటు ముందుగానే ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులతో పాటు, కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులతో పాటు తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పౌర్ణమి గరుడ సేవ కావడంతో...
ఈరోజు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందువల్ల భక్తుల సంఖ్య ఎక్కువయింది. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఘాట్ రోడ్డులో కూడా వాహనాల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వసతి గృహాలు దొరకడం కూడా ఆలస్యమవుతుంది. అన్న ప్రసాదం, లడ్డూ కౌంటర్ల వద్ద కూడా అధిక సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బాట గంగమ్మ ఆలయం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగానే క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,773 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,100 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.