Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్.. క్యూ లైన్ ఎంత పొడవుందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. శనివారం ఏడుకొండలవాడిని తీదర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటే శుభప్రదమని అందరూ విశ్వసిస్తారు. అందుకే శనివారం నాడు తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని భావించి కొండకు చేరుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు.
ఘాట్ రోడ్డులో ట్రాఫిక్...
తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్లన్నీ వాహనాలతో ఈరోజు తెల్లవారు జాము నుంచే రద్దీగా మారాయి. ఇటీవల ఘాట్ రోడ్డు పై ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనాల రాక నిలిచిపోవడంతో పోలీసులు ఎక్కడకక్కడ చర్యలు తీసుకుంటూ వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల ఇబ్బందులు పడకుండా అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఎస్.జి. షెడ్స్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,559 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.