Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్... క్యూ లైన్ లోకి ప్రవేశిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గ లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గ లేదు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. దసరా సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో పెరిగిన రద్దీ ఇంకా అలాగే ఉంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. తమిళనాడు కు చెందిన ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తమిళనాడు నుంచి...
నిన్న గరుడ పౌర్ణమి కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. నేడు కూడా అదే రద్దీ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు నెలతో సంబంధం లేకుండా, సెలవులతో నిమిత్తం లేకుండా పోటెత్తుతున్నారు. ఆధ్యాత్మికత బాగా పెరిగిపోవడంతో పాటు బాలాజీ వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ఇంకా కొన్ని రోజులు ఇదే రద్దీ కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయటశిలాతోరణం వరకూ క్యూ లైన్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం నేడు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,634 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,980 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.