Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు అలెర్ట్... నేడు రద్దీ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. సోమవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. దసరా సెలవులు పూర్తయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తమిళనాడు నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో కొండ కిక్కిరిసిపోతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్నటి వరకూ బ్రహ్మోత్సవాలు కూడా జరగడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గత నాలుగు నెలల నుంచి తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది.
ప్రతి రోజూ టోకెన్లు...
తిరుపతిలో ప్రతి రోజు మధ్యాహ్నం 3గంటలు లేదా 4 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం,రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు జారీ చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 3గంటలు లేదా 4 గంటల నుంచి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్లు పన్నెండు వేల వరకూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,412 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,058 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.