Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమల వీధులన్నీ భక్తజన సంద్రంతో కిటకిటలాడిపోతున్నాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గత నాలుగు నెలల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సీజన్ లేకుండా...
తిరుమలకు ఇప్పుడు ఒక వారం లేకుండా పోయింది. గతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. అలాగే వేసవి సమయంలో సెలవులు ఉండటంతో పాటు పండగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండేది. మిగిలిన రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండేది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా వారంతోనూ, కాలంతోనూ సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తమిళనాడు నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పెరటాసి మాసం కావడంతో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అక్టోపస్ బిల్డింగ్, గోగర్భం డ్యామ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,581 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,976 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.